Ad Code

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల పనులకు రూ.904 కోట్లు

 గోదావరి పుష్కరాలు-2027కు రూ.904 కోట్లతో పనులు చేపట్టేందుకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పుష్కర ఏర్పాట్లపై కార్పొరేషన్‌లో మంగళవారం తొలి సమావేశం నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందేశ్వరితోపాటు ఎమ్మెల్యేలు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. కమిషనర్‌ కేతన్‌ గర్గ్‌ మాట్లాడుతూ.. మూడు విడతల్లో పనులు చేపట్టనున్నామన్నారు. ఈసారి 8 కోట్ల మంది రావచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. రూ.400 కోట్లతో గోదావరి బండ్‌ రోడ్డును విస్తరించి అదనంగా 17 ఘాట్లను నిర్మించాల్సి ఉందన్నారు. 74 పార్కింగ్‌ ప్రాంతాల ఏర్పాటుకు 800 ఎకరాలు సేకరిస్తున్నామన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్ర భాగస్వామ్యంపై త్వరలో చర్చిస్తామన్నారు. అఖండ గోదావరి పొడవునా పుణ్యస్నానాలు ఆచరించేలా అవసరమైతే మఠాధిపతులతో ప్రచారం చేయించాలన్నారు. మంత్రి దుర్గేశ్‌ మాట్లాడుతూ ఈసారి పుష్కరాలకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి(రాజమహేంద్రవరం గ్రామీణం), బత్తుల బలరామకృష్ణుడు(రాజానగరం), ముప్పిడి వెంకటేశ్వరరావు(కొవ్వూరు), అధికారులు పాల్గొన్నారు.